Tuesday, February 26, 2013

హిందోళ రాగం

(ఇంతకు ముందు వ్యాసాల్లో పరిచయం చేసిన మోహనం, అభేరి, సింధుభైరవి, కల్యాణి రాగాల్లాగే, హిందోళం రాగం కూడా చాలా ప్రసిద్ధమైన రాగం. రాగలహరి శీర్షికలో రాగాలను పరిచయం చేస్తున్నప్పుడు “ఏ రాగాలను పరిచయం చెయ్యాలి?” అన్న ప్రశ్న సహజంగానే వచ్చింది. ఈ రాగాలను ఎన్నుకోటంలో రెండు నియమాలు పాటించటం జరిగింది. మొదటిది జనసామాన్యానికి బాగా పరిచయమైన రాగం కావటం ఒకటి. ఎన్నుకున్న రాగంలో వీలైనన్ని సినిమా పాటలు ఉండటం మరొకటి. ఇప్పటి వరకు పరిచయం చెయ్యబడ్డ రాగాలు ఈ కోవకి చెందినవే! ఇప్పుడు పరిచయం చెయ్యబోతున్న హిందోళం రాగం ఐదో రాగం. ఐదు స్వరాలున్న హిందోళం రాగం, ఐదో రాగంగా పరిచయం చెయ్యడం కేవలం యాధృచ్ఛికమే!)

హిందోళం రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు
1. సందేహించకుమమ్మా… (లవకుశ)
2. కలనైనా నీ తలపే… (శాంతినివాసం)
3. నారాయణా హరి నారాయణా… (చెంచులక్ష్మి)
4. పగలే వెన్నెలా… (పూజాఫలం)
5. నేనే రాధనోయీ… (అంతా మన మంచికే)
6.పిలువకురా అలుగకురా… (సువర్ణ సుందరి)
7. మోహనరూపా గోపాలా… (కృష్ణ ప్రేమ?)
8. వీణ వేణువైన సరిగమ… (ఇంటింటి రామాయణం)
9. చూడుమదే చెలియా … (విప్రనారాయణ)
10. సామజవర గమనా… (శంకరాభరణం)
11. రాజశేఖరా నీపై… (అనార్కలి)
12. అందమె ఆనందం… (బ్రతుకు తెరువు)
13. శ్రీకర కరుణాలవాల… (బొబ్బిలి యుద్ధం)
14. రామ కధను వినరయ్యా… (లవకుశ)
15. మనసే అందాల బృందావనం… (మంచి కుటుంబం)
16. సాగర సంగమమే ప్రణయ… (సీతాకోక చిలుక)
17. కొండలలో నెలకొన్న కోనేటి… (అన్నమాచార్యుని కీర్తన)
18. ఓం నమశ్శివాయ… (సాగర సంగమం)
19. ఆధాహై చంద్రమా… (నవ్‌రంగ్‌)
20. భావోద్యానమునందు… (కరుణశ్రీ పద్యం ఘంటసాల)
21. మన్‌ తడపత్‌… (బైజు బావరా)
22. భజరే గోపాలం (సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన)

పంచస్వర రాగాలలో హిందోళం చాలా రక్తి కట్టించే రాగం. సప్తస్వరాలలోని “ప”, “రి” స్వరాలు హిందోళంలో లేవు!ఇంతకుముందు చెప్పుకున్న మోహనం రాగంలాగే, హిందోళం కూడా ఐదు స్వరాలున్న జనరంజకమైన ప్రసిద్ధ రాగం. అన్నీ కోమల స్వరాలే అవడం వల్ల, చాలా రుచిగా, తీయగా ఉండే రాగం. మనోధర్మ సంగీతం పాడటానికి అనుకూలమైన రాగం హిందోళం. ఈ రాగం అన్నివేళలా పాడవచ్చు. కచ్చేరీలలో ఈ రాగాన్ని ముఖ్యమైన రాగంగా తీసుకొని చాలాసేపు పాడవచ్చు. నిర్దిష్టమైన రూపంకలిగిన హిందోళం రాగం కరుణ, భక్తి, శృంగార రసాలను పోషింపగలదు.
8వ మేళకర్త అయిన హనుమత్తోడి జన్యరాగం హిందోళం. ఈ రాగంలో ప్రసిద్ధ రచనలు సామజవర గమనా (త్యాగరాజు), మనసులోని మర్మము (త్యాగరాజు), నీరజాక్షి కామాక్షి (ముత్తుస్వామి దీక్షితార్‌), భజరే గోపాలం (సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన).

స్వరస్థానాలు పరిచయం
ఇంతకు ముందు చెప్పినట్లు హిందోళం, ఔడవ రాగం. అంటే, ఆరోహణలోనూ అవరోహణలోనూ కూడా ఐదు స్వరాలే ఉంటాయి.
స X X గ1 X మ1 X X ద1 X ని1 X స
ఆరోహణ సగమదనిసా
అవరోహణ సానిదమగస

హిందూస్తానీ సంగీతంలో…

హిందూస్తానీ సంగీతంలోని “మాల్‌కోన్స్‌” రాగం మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని హిందోళం రాగానికి సమానం. స్వరస్థానాల్లో హిందోళానికి, మాల్‌కోన్స్‌కి తేడాలు ఏమీ లేవు. నిజానికి, ఈ రెండు రాగాల్లో ఒకటి తెలిస్తే, రెండవ రాగాన్ని పోల్చుకోటం చాలా సులువు. మాల్‌కోన్స్‌ రాగం చాలా ప్రాచుర్యం పొందిన పాత రాగం. అతి మధురంగా ఉండే రాగాల్లో ఈ రాగం ముఖ్యమైనది. ఆరోహణ అవరోహణ స్వరాలు పైన చెప్పినట్లు కర్ణాటక పద్ధతిలో ఉన్నట్టుగానే ఉంటాయి. మాల్‌కోన్స్‌ రాగం పకడ్‌ ఇలా ఉంటుంది.
స మగ ధనిధమ గస
మాల్‌కోన్స్‌ రాగానికి వాది స్వరం “మ”, సంవాది స్వరం ” స”.

హిందూస్తానీ సంగీతంలో ఆందోళన స్వరాలని కొన్ని ఉంటాయి. అంటే, ఈ స్వరాలు పలుకుతున్నప్పుడు కాని, వాయిద్యాలపై పలికిస్తున్నపుడు కాని ఈ స్వర స్థానాల్లో “కంపనం” ఎక్కువగా చేస్తారు. సైన్సు భాషలో చెప్పాలంటే, ఆందోళన స్వరాల frequency కి అతిదగ్గరగా ఉండే ఇతర frequency లను కూడా పలకటం లేదా పలికించటం జరుగుతుంది. ఈ frequncy మార్పులు మరీ ఎక్కువైతే, పక్క స్వరంలోకి వెళ్ళిపోతాము. అలా కాకుండా, చాలా subtle గా ఉండేట్లుగా స్వరాన్ని కంపించేట్లుగా చెయ్యాలి. ఈ ఆందోళన స్వరాలనే మన కర్ణాటక సాంప్రదాయ సంగీతంలో “కంపిత” స్వరాలంటారు. మాల్‌కోన్స్‌లో గాని హిందోళంలో గాని “గ, ని, ధ” స్వరాలను ఆందోళన లేదా కంపిత స్వరాలంటారు. స్వరం “మ” ఆందోళన / కంపిత స్వరం కాదు. కంపించకుండా వదిలేసినపుడు, “మ” స్వరం ఠీవిగా ఉంటుంది. హిందోళం రాగంలా కాకుండా, మాల్‌కోన్స్‌ను రాత్రి 9 గంటలనుంచి అర్ధరాత్రి దాకా పాడతారు.

సినిమా పాటలు
హిందోళం లేక మాల్‌కోన్స్‌ రాగాల్లో సినిమా పాటలు బోలెడు వినిపిస్తాయి. “లవకుశ” (1963) సినిమా రిలీజ్‌ అయిన సెంటర్స్‌ అన్నిట్లోనూ 100 రోజులు ఆడిన మొదటి తెలుగు సినిమా అన్న విషయం సినిమా ప్రియులకు తెలిసిందే! ఈ సినిమా విజయానికి ఒక కారణం ఈ సినిమాలోని అన్ని పాటలూ, పద్యాలూ జనాదరణ పొందటమే! ఈ సినిమాలో హిందోళం రాగంలో ఘంటసాల కంపోజ్‌ చేసి పాడిన “సందేహించకుమమ్మా..” అన్న పాట చెప్పుకోతగ్గది. శుద్ధ హిందోళంలో వినిపించకూడని “పంచమం”, “రిషభం” స్వరాలను (ప, రి) ను చాలా గమ్మత్తుగా వాడుతూ, హిందోళం రాగం మూడ్‌ మార్చకుండా వాడుకున్న ఘంటసాలను మెచ్చుకుతీరాలి. ఇదే సినిమాలో “రామకధను వినరయ్యా..” అన్నపాట కూడా హిందోళంలో స్వరపరచిందే.ఆ నాటి ప్రముఖ గాయకులైన లీలసుశీల ల గొంతులను ఘంటసాల ఈ సినిమాలో ఉపయోగించినట్లు మరేసినిమాలోనూ ఏ సంగీతదర్శకుడూ ఉపయోగించలేదు. అలాగే ఘంటసాల సంగీత దర్శకత్వం చేసిన “గుండమ్మ కధ” సినిమాలో, ఎల్‌. విజయలక్ష్మి solo డాన్స్‌ చూపిస్తున్నప్పుడు నేపధ్య సంగీతంలో నాదస్వరం ద్వారా వినిపించే సంగీతం హిందోళంలో ట్యూన్‌ చెయ్యబడ్డదే! మనకి నాదస్వరంలాగే, ఉత్తర భారత దేశంలో చాలా పాప్యులర్‌ అయిన బిస్మిల్లాఖాన్‌ “షెహనాయి”లో మాల్‌కోన్స్‌లో ఉన్న బాణీ చాలా మంది సంగీత ప్రియులకు పరిచితమే!

సినిమా మాత్రమే కాకుండా పాటల ద్వారా కూడా పాప్యులర్‌ అయిన “శంకరాభరణం” సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో “సామజవర గమన” అన్న పాట హిందోళం రాగంలో కూర్చబడిందన్న విషయం సినిమాలోనే చెప్పబడింది. ఐతే, ఈ పాట చివర్లో ఆలాపన పూర్తికాకుండానే పాటను ఆపేయటం జరుగుతుంది. “శుద్ధ హిందోళంలో రిషభం ఎలా వచ్చింది?” అన్న ప్రశ్న వస్తుంది. సినిమా కధకోసం కావాలనే హిందోళంలో అపస్వరమైన “రిషభం” స్వరం పాట చివరి ఆలాపనలో వాడబడటం నిజంగానే జరిగిందన్న విషయం, ఈ రాగంతోటీ, స్వరాలతోటీ పరిచయమున్న పాఠకులకు తెలిసే ఉంటుంది!

రహస్యం (1967) సినిమాలో ఘంటసాల సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “గిరిజా కల్యాణం” అనే యక్షగానం చాలా పాప్యులర్‌ అయింది. ఇందులో అనేక రాగాలు ఉపయోగించుకున్న ఘంటసాల (యక్షగాన రచయిత శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సూచనమేరకు) “సామగ సాగమ” సాకారా (ఉమాబాల ధ్యాన నిష్ఠలో ఉన్న సదాశివుని సేవించే విధం) అనే అక్షరాలకు హిందోళం రాగంలో అవే స్వరస్థానాలు ఇవ్వటం గమనించతగ్గది.

తెలుగు సినిమాలకి సంగీతం ఇచ్చిన కన్నడ సంగీత దర్శకుల్లో రాజన్‌నాగేంద్ర జంట చెప్పుకోతగ్గది. “ఇంటింటి రామాయణం” అన్న సినిమా కోసం హిందోళంలో స్వరం ఇచ్చిన “వీణ వేణువైన సరిగమ” అన్న పాట ఒక మంచి పాట. ఈ పాటలో శుద్ధ హిందోళంలో వాడకూడని అంతర గాంధారం (తీవ్ర గాంధారం లేక గ2) వాడటం జరిగింది. అంటే, హిందోళంలో ఉన్న గ1 కాక గ2 కూడా వాడారు. ఐతే, ఈ రెండు గాంధారాలు వాడటం కొంత వింతగా ఉంటుంది. “వీణ (మామ) వేణు (గా2గ2) వైన (గా1గ1)” వంటి వాడకం జరిగింది. “వేణు వైన” అన్నప్పుడు “వేణు” లోని గ2 స్వరం నుంచి “వైన” అన్నపుడు వాడిన గ1 స్వరంలోకి glide అవుతుందన్నమాట. ఇలాంటి ప్రయోగాలు సంగీత దర్శకులకి కొత్త కాదు కానీ, హిందోళం రాగం ప్రసక్తి వచ్చింది కాబట్టి ఈ ఉదాహరణ సందర్భానికి తగ్గట్టే ఉంది.

హిందీ సినిమాల్లో కూడా మాల్‌కోన్స్‌ చాలా ఎక్కువగా వాడారు. ఉదాహరణకి, మహమ్మద్‌ రఫీ “బైజు బావరా” సినిమా కోసం పాడిన “మన్‌ తడపత్‌” అన్నది ఒక గొప్ప పాట. ఈ పాట వింటూంటే, తెలుగు సినిమాలలో హిందోళంలో కంపోజ్‌ చేసిన తెలుగు పాటలు చాలా గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఈ పాటలో రఫీ గొంతు, పాట ద్వారా పోషింపబడిన భక్తి రసం, అన్నిటికంటే ఎక్కువగా గుర్తు పట్టుకోవలసిన నౌషాద్‌ సంగీత దర్శకత్వం మరపు రానివి.

సినిమా పాటల ప్రసక్తి వచ్చినపుడు, (ర)సాలూరు రాజేస్వరరావు పేరు చెప్పకపోతే ఈ వ్యాసానికి సంపూర్ణత ఉండదు. అందుకనే, శ్రీ సాలూరు వారు “పూజా ఫలం” సినిమాకి కంపోజ్‌ చేసిన అన్ని గొప్ప పాటలలో, హిందోళంలో బాణీ కట్టి, శ్రీమతి ఎస్‌.జానకిచే పాడించిన ఈ క్రింది పాట స్వరాలతో ఈ వ్యాసం ముగిస్తున్నాను. ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఒక చరణానికి మరొక చరణానికి మధ్యలోనూ చరణం మధ్యలోనూ వచ్చే స్వరాలు ప్రాక్టీస్‌ చెయ్యతగినవి.

“పగలే వెన్నెలా …” స్వరాలు
Opening ఆలాపన
పగలే వెన్నెలా జగమే ఊయలా
కదిలే ఊహలకే కన్నులుంటే …
Flute సానిదసా నిదమా నీదమనీ దమగా
Piano సమమగస మదదదమ దనినినిద నీసా

మొదటి చరణం
నింగిలోన చందమామ తొంగిచూచె (నీసాదనీ)
నీటిలోన కలువభామ పొంగిపూచె
ఈ అనురాగమే జీవన రాగమై (దనిసగ సమగమస)
ఎదలో తేనెజల్లు కురిసిపోదా “పగలే వెన్నెలా…”
Flute సానిదసా నిదమా నీదమనీ దమగా
Piano సమగస మదదదమ దనినినిద నీసా

రెండవ చరణం
కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసె (నీసాదనీ)
మురళి పాట విన్న నాగు శిరసునూపె
నినిసస నినిసస దదనిని మమదదనిని దదనినిసా
ఈ అనుబంధమే మధురానందమై (దనిసగ సమగమస)
ఇలపై నందనాలు నిలిచిపోగా “పగలే వెన్నెలా…”
Flute సానిదసా నిదమా నీదమనీ దమగా
Piano సమగస మదదదమ దనినినిద నీసా

మూడవ చరణం
నీలి మబ్బు నీడ చూచి నెమలి ఆడె
పూల ఋతువు సైగ చూసి పికము పాడె
దనిసగసని దనిసగసని దనిసగసనిసా
మనసే వీణగా ఝణఝణ మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసి పోదా “పగలే వెన్నెలా…”

0 comments:

Post a Comment